ఓవైపు డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన వైన్ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు.. హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. న్యూ ఇయర్ వేడుకలపై విధించిన ఆంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఆయన.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.. ఇక, స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు.. ఎక్కడైనా, ఎవరైనా కోవిడ్ రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు సీపీ సీవీ ఆనంద్.. ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దు అని స్పష్టం చేసిన ఆయన.. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు.. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు అని సూచించారు. ఇక, రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని ఈవెంట్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, డిసెంబర్ 31వ తేదీన రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్టు వెల్లడించారు.. తాగి రోడ్లపై హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవని.. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం.. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.