ఆహా ఓటీటీ వేదికగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఏడు ఎపిసోడ్లు పూర్తికాగా ఇప్పుడు 8వ ఎపిసోడ్‌గా రానా ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోమోను ఆదివారం నాడు ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య, రానా మాట్లాడుకున్న విషయాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతోందని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య అంటేనే బెస్ట్’ అంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు.
అనంతరం ‘తొలిసారి బాలయ్య టాక్ షో చేస్తున్నాడంటే నీకు ఏమనిపించింది’ అని రానాను బాలయ్య ప్రశ్నించాడు. ‘తాము టాక్ షోలలో మాములు ట్రైన్‌లలో వెళ్తుంటే మీరు బుల్లెట్ ట్రైన్‌లో దూసుకువెళ్తున్నట్లు అనిపిస్తోంది’ అంటూ రానా బదులిచ్చాడు. అనంతరం… లాక్‌డౌన్‌లో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబూ అంటూ రానాను బాలయ్య టీజింగ్ చేశారు. మీరెప్పుడైనా వసుంధరగారికి ఐలవ్‌యూ అని చెప్పారా అని రానా అడగ్గా.. నీకెందుకయ్యా అంటూ బాలయ్య నవ్వులు పంచారు. ఆ తర్వాత తన శ్రీమతికి ఫోన్ చేసి బాలయ్య ఐలవ్‌యూ చెప్పారు. మీ భార్యతో ఆర్గ్యుమెంట్ అయితే ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు అని రానా అడగ్గా.. కృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు.. ఇక బాలకృష్ణుడు ఎంత అంటూ బాలయ్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అటు ఈ ఇంటర్వ్యూలో ఏమంటివి.. ఏమంటివి అనే డైలాగ్‌ను రానా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎపిసోడ్ ఈనెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.