తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు… మరికొన్ని ప్రాంతాల్లో గాలివానలు భయపెడుతున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటికే పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
దట్టంగా మంచు కురిసే వేళలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. అకాలంలో పడుతున్న ఈ వర్షాలు… రైతులకు అపార నష్టాన్ని మిగిలుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం… సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి.
కోస్తాంధ్రలో జనవరి 17 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వారానికిపైగా వర్ష సూచన ఉండటంతో… ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ తేలికపాటి జల్లులు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాలతో రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులు నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత ఐదు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. జనవరి 17 వరకు ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. మరికొన్ని రోజులపాటు వానలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం కూడా పెరిగింది.