కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మరణించడంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన భౌతికంగా అభిమానుల మధ్య లేకపోయినా సినిమాల రూపంలో కళ్ల ముందు మెదులుతున్నారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులను ప్రజలు తమ హృదయాల్లో దాచుకున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పునీత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో ప్రధానంగా విధి గురించి పునీత్ చెప్పే వీడియో బాగా వైరల్ అవుతోంది.
‘ఉండేది ఒకే జీవితం.. ఏం జరిగిందో గుర్తుండదు.. ఏం జరగబోతుందో తెలియదు. భవిష్యత్ మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. కాస్త ముందూ వెనకా అందరూ పోతారు. ఏం తిన్నాం, ఏం సంపాదించాం అనేది నథింగ్, విధి రాసినట్టు జరుగుతుంది’ అంటూ పునీత్ రాజ్‌కుమార్ చెబుతున్న డైలాగ్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇలా తన సినిమాల ద్వారా పునీత్ చెప్పిన లైఫ్ ఫిలాసఫీలకు చెందిన వీడియోలు ఆయన చనిపోయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 46 ఏళ్ల వయసులోనే పునీత్ మరణించినా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చివరకు తన ప్రాణం పోయినా కానీ వేరొకరికి చూపు ప్రసాదించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు తన కళ్లను దానం చేశారు.
కాగా స్టార్ నటుడిగా ఎదిగిన పునీత్ రాజ్ కుమార్ ఫిట్‌నెస్ కోసం నిత్యం శ్రమిస్తుండేవారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ఆయన చేసిన కసరత్తుల వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. అయితే ఒక్కోసారి కొంచెం ఎక్కువగానే బాడీని ఫిట్‌గా ఉంచేందుకు పునీత్ ప్రయత్నించారు. అయితే వయసు ఎక్కువ కావడంతో పాటు కసరత్తుల ప్రభావం హార్ట్‌పై పడిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. పునీత్ కుటుంబంలో చాలా మంది గుండెపోటు బారిన పడ్డారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్ కూడా గుండెపోటుతోనే మరణించగా పెద్దన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్, చిన్న అన్నయ్య శివరాజ్‌కుమార్‌లకు సైతం హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు… పునీత్ పడలేకపోయాడు. ఇటీవల యువరత్న సినిమా ప్రమోషన్‌లలోనూ పునీత్ చురుగ్గా పాల్గొన్నాడు. తన అభిమానులను స్వయంగా కలిసి ఆశ్చర్యపరిచాడు.
Read Also: పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా