ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అని చెప్పవచ్చు. కాగా, ఇప్పుడు ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీలో కాంగ్రెస్ తోపాటుగా సమాజ్ వాదీ పార్టీ కూడా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా పోటాపోటీగా జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ అంటే రాహుల్‌కు భయం అని, ప్రియాంక గాంధీ శక్తి సామర్థ్యాలను చూపి రాహుల్ గాంధీ భయపడుతున్నారని, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించకపోవడం వెనుక ఇదే కారణం అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రియాంక గాంధీలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పోలికలు, బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.