అలనాటి కథానాయిక, నాట్యకారిణి శోభన, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పరిణయం’. సెప్టెంబర్ 24 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత యేడాది ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన ‘వరనే అవశ్యముంద్’కు ఇది అనువాదం.
నీనా (శోభన) సింగిల్ మదర్. హౌస్ వైఫ్ గా ఉండిపోకుండా రకరకాల వ్యాపకాలతో నిత్యం బిజీ ఉంటుంది. ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేయడంతో పాటు ఫిట్ నెస్ అండ్ డాన్స్ క్లాసెస్ తీసుకుంటుంది. అంతేకాదు ఆమె మంచి గాయని కూడా. ఆమె కూతురు నికిత (కళ్యాణి ప్రియదర్శన్) తల్లి మాదిరి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది. మాట్రిమోనియల్ పోర్టర్ ద్వారా వచ్చిన సంబంధాలను వడపోసి, అభి అనే యువకుడిని పెళ్ళాడలని అనుకుంటుంది. ఇక వీళ్ళు ఉండే అపార్ట్ మెంట్ లోకే రిటైర్డ్ మేజర్ చిన్నికృష్ణ (సురేశ్ గోపీ) వచ్చి చేరతాడు. దానికి కొద్ది రోజుల ముందు ఫ్రాడ్ అనే ముద్దుపేరున్న బిబీష్ (దుల్కర్ సల్మాన్), అతని తమ్ముడు, అమ్మమ్మ ఆకాశవాణి (కెపిఏసీ లలిత)తో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ లోని ఫ్లాట్ లో దిగుతాడు. నీనా, మేజర్ చిన్నికృష్ణ మధ్య ఏర్పడిన పరిచయం వారిని మానసికంగా దగ్గర చేస్తుంది. ఈ విషయం నికిత దృష్టిలో పడుతుంది. తల్లి విషయంలో ఎలాంటి నిర్ణయం నికిత తీసుకోలేకపోతున్న సమయంలో అభితో బ్రేకప్ అవుతుంది. అదే సమయంలో బిబీష్ గర్ల్ ఫ్రెండ్ సైతం అతన్ని కాదని వెళ్ళిపోతుంది. దాంతో నీనా బిబీష్ కు చేరువ అవుతుంది. ఇటు నీనా, మేజర్; అటు నికితా, బిబీష్… ఈ రెండు జంటల ప్రేమ ప్రయాణం ఎలా సుఖాంతమైందన్నదే మిగతా కథ.
భిన్నమైన మనస్తత్వాలు, నేపథ్యాలు కలిగిన నలుగురు వ్యక్తులు ఒకే అపార్ట్ మెంట్ లో ఉన్నప్పుడు వారి మధ్య ఏర్పడే పరిచయాలు, ఎలా ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తాయనే అంశాన్ని డెబ్యూ డైరెక్టర్ అనూప్ సత్యన్ సున్నితంగా, హృదయానికి హత్తుకునేలా చూపించాడు. పాత్రల పరిచయం చాలా క్యాజువల్ గా చేసినా… వాటి నడక, ముగింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తెర మీద కనిపించే చిన్న పాత్రకు కూడా ఓ మేనరిజమ్, ఓ పద్ధతి ఉండేలా చూసుకున్నాడు. దాంతో ప్రతి పాత్రలోనూ మనకు జీవం కనిపిస్తుంది. వాటిని పోషించిన నటీనటులు కాకుండా పాత్రలే కనిపిస్తాయి. సింగిల్ మదర్ కు పిల్లల పట్ల ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. అయితే పిల్లలు దానిని పట్టించుకోనప్పుడు పడే బాధ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఇందులో కొన్ని సన్నివేశాలలో నీనా, ఆమె కూతురు నికిత మధ్య అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి. తల్లి పునర్ వివాహం గురించి నికిత తొలుత నెగెటివ్ గా ఆలోచించినా, ఆ తర్వాత ఆమె భావాలను గౌరవిస్తుంది. ప్రధాన పాత్రల తాలుకు గతాన్ని కూడా హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరపై చూపించాడు. క్లిష్టమైన అంశాన్ని తీసుకుని సుతిమెత్తగా వాటిని తెరపై చూపించడంతో పాటు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య ఉండాల్సిన బంధాన్ని క్యూట్ గా ప్రెజెంట్ చేశాడు.
ఆల్ఫోన్స్ జోసఫ్ నేపథ్య సంగీతం హాయిగా ఉంది. అలానే పాటల బాణీలూ బాగున్నాయి. ముఖేశ్ మురళీధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్. అయితే… ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్న సందర్భంగా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది. అప్పుడు సినిమా మరింత వేగంగా సాగిన అనుభూతి వీక్షకులకు కలిగి ఉండేది. ఆహాలో విడుదలవుతున్న డబ్బింగ్ సినిమాలకు వేణుబాబు సంభాషణలను, రాంబాబు గోసాల పాటలను అందిస్తున్నారు. వీరిద్దరూ తమ ప్రతిభతో సినిమాకు తెలుగుదనాన్ని అద్దుతున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. అలానే అనువాద కార్యక్రమాల విషయంలోనూ నిర్మాతలు రాజీ పడలేదు. అది తెర మీద కనిపిస్తోంది.
నటీనటుల విషయానికి వస్తే… నీనా పాత్రలో శోభన చక్కగా ఒదిగిపోయింది. ఆమెను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఈ కథను రాసుకున్నాడనిపిస్తోంది. మరో విశేషం ఏమంటే… దాదాపు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత సురేశ్ గోపీ ఈ సినిమాలో మేజర్ పాత్ర పోషించాడు. అలానే సురేశ్ గోపీ – శోభన దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో జంటగా నటించారు. వారు కాకుండా తెర మీద ఆ యా పాత్రలే కనిపించాయి. ఈ సినిమాకు నిర్మాత కూడా అయిన దుల్కర్ సల్మాన్… కేవలం ఓ పాత్రను పోషించాడు తప్పితే… తానే హీరో అనే భావన ఎక్కడా కలిగించలేదు. కళ్యాణీ ప్రియదర్శన్ కూడా నికిత పాత్రకు చక్కటి న్యాయం చేకూర్చింది. ఇక టీవీ సీరియల్ నటిగా కేపీఎసీ లలిత, డెంటిస్ట్ గా ఊర్వశి, మామి పాత్రగా మీరా కృష్ణన్ చక్కగా నటించారు. ప్రతి పాత్రను చక్కగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అనూప్ సత్యన్ ను అభినందించాలి. ఈ సినిమా మలయాళం పేరు ‘వరనే అవశ్యముంద్’. అంటే ‘వరుడు కావాలి’ అని అర్థం. తెలుగులో మొదట అదే పేరు పెట్టారు. కానీ నాగశౌర్య హీరోగా ‘వరుడు కావలెను’ అనే సినిమా రాబోతోంది. దాంతో ఈ మూవీ పేరును ‘పరిణయం’గా మార్చారు. అదీ ఈ కథకు తగ్గ పేరే! సరదా సాయంత్రం వేళ ఈ సినిమాను చూస్తే… మనసుకు హాయిగా అనిపిస్తుంది. సున్నితమైన హాస్యంతో పాటు భావోద్వేగాలను కలిగించే సన్నివేశాలతో సాగే ‘పరిణయం’ మీకు నచ్చొచ్చు!
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే శోభన అభినయం
హృదయాన్ని హత్తుకునే కథ
వీనుల విందైన సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
కన్వెన్సింగ్ గా లేని కొన్ని సీన్స్
రేటింగ్ : 2.5 / 5
ట్యాగ్ లైన్: భావోద్వేగ ‘పరిణయం’