కళలకు కాదేదీ అనర్హం.. అన్న నానుడిని నిజం చేస్తూ పనిలోనే కళాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఓ చేనేత కళాకారుడు.చేనేత వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుని అందులోనే అద్భుతాలను సృష్టిస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీర, శాలువాలను తయారుచేయడంతో పాటు తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో చిత్రాలను తన మగ్గంపై నేశాడు.
తాజాగా చేనేత మగ్గంపై అగ్గి పెట్టెలో ఇమిడే చీర వన్ గ్రామ్ గోల్డ్ జరీతో నేశారు. దీంతో పాటు దబ్బనంలో నుండి దూరే చీర కట్టుకునే విధంగా తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ కు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే నేత కార్మికుడు. పదో తరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్ చిన్నతనం నుండే మరమగ్గాలపై ఆసక్తిని పెంచుకున్నాడు.
తన ఇంట్లో ఉన్న మరమగ్గాలపై తండ్రి పోశెట్టి మగ్గం నేస్తే, తల్లి రాజ్యలక్ష్మి మగ్గానికి అవసరమైన కండెలు చుట్టేది. ఇలా గమనిస్తున్న హరిప్రసాద్‌కు తనేమైనా వినూత్నంగా తయారు చేయాలనే కోరిక కలిగింది. మొదటగా వెదురు కర్రతో కేవలం 10 సెంటీమీటర్ల పొడవు, 200 గ్రాముల బరువు ఉండే మగ్గాన్ని తయారు చేశాడు. అగ్గి పెట్టెలో ఇమిడే చీర.. శాలువా, ఉంగరంలో.. సూదిలో దూరే చీరలను తయారీ చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందాడు.
ఇదే స్పూర్తితో గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన హరిప్రసాద్ కు జాతీయ చేనేత దినోత్సవం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి ఆవార్డు సైతం లభించింది. తెలంగాణలో సిరిసిల్ల చేనేత కళలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది..అగ్గిపెట్టెలో పట్టే గోల్డ్ పూత చీర ను చూసేందుకు ఇతర రాష్ట్రాలవారు సైతం క్యూ కడుతున్నారు. చేనేత కార్మికుడు హరి చేత తయారు చేయబడిన ఈ చీరను చూసి విదేశాల్లో ఉన్నవారు సైతం తమకు ఇలాంటివి కావాలని ఆర్డర్లు ఇస్తున్నారు. మగ్గంపై నేస్తూ మన్ననలు పొందుతున్న వెల్ది హరిని ప్రభుత్వం ప్రోత్సాహిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తాడని స్థానికులు కోరుతున్నారు.