గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామంలో వైసీపీ ఫ్యాక్షన్ మూకలు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలని. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.