దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Read: వైరల్: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఆనంద్ మహీంద్రా…
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 10 గంటల తరువాత రోడ్డుపైకి ఎవరూ రాకూడదని, అత్యవసర సర్వీసులు మినహా ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేరళలో 24 గంటల్లో 1636 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో బార్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నారు. కేరళలో 98 శాతం మందికి మొదటి డోస్, 77 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్టు కేరళ ఆరోగ్యశాఖ తెలియజేసింది.