టీడీపీ అధికారానికి దూరమై దాదాపు రెండున్నేళ్లు కావస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన నేతలంతా మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. కొద్దిరోజులుగా టీడీపీలోని కొందరు సీనియర్లు అధినేతపై ధిక్కార స్వరాన్ని విన్పిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
ఈక్రమంలోనే పార్టీలోని సీనియర్లకు వలస నేతలకు మధ్య గ్యాప్ పెరిగినట్లు కన్పిస్తోంది. ఇది రోజురోజుకు ఇది ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వలస నేతలకు ప్రాధాన్యం ఇచ్చారని సీనియర్ నేతలతోపాటు క్యాడర్ గుర్తు చేసుకుంటోంది. ఇదే విషయాన్ని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య సైతం ఇటీవల లేవనెత్తారు. ఆయన ఏకంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.
గోరంట్ల రాజీనామాతో టీడీపీలో కలకలం మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలోని సీనియర్లు, చంద్రబాబు ఆయనతో మాట్లాడి వివాదాన్ని సర్దుమణించారు. అయితే పార్టీలోని క్యాడర్లో మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వలస వచ్చిన నేతలకే చంద్రబాబు కీలక పదవులు కట్టబెట్టారని ఇప్పుడు వాళ్లే టీడీపీకి శాపంగా మారుతున్నారని కిందిస్థాయి నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళుతున్నారు.
పార్టీలో తొలి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయనపై ఒత్తిడి తెచ్చుకున్నారు. వలస నేతలకు పార్టీకి దూరంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన అమర్ నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ లకు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని క్యాడర్ తప్పుబడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమర్ నాథ్ రెడ్డికి మంత్రి పదవి, కిషోర్ కు నామినేటేడ్ పదవిని ఇచ్చారు. అయితే వారు ఇప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జేసీ బ్రదర్స్ కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలస వచ్చారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు వీరికి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే జేసీ బ్రదర్స్ తీరు టీడీపీ క్యాడర్ కు పెద్దగా నచ్చడం లేదు. దీంతో వీరికి వ్యతిరేకంగా టీడీపీ క్యాడర్ అంతా ఏకమవుతోంది. అనంతరం జిల్లాలో వీరికి పెత్తనం ఇస్తే సహించేది లేదంటూ టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. దీంతో వీరి డిమాండ్ కు చంద్రబాబు సైతం తలొగ్గాల్సి వస్తుంది.
మొత్తానికి టీడీపీలో సొంత పార్టీ నేతలు వర్సెస్ వలస నేతలు అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఇరువర్గాల తీరు చంద్రబాబుకు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్పి నేతలను సర్దిచెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారం లేకపోవడంతో ఆయన మాటను ఎవరు లెక్కలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో పార్టీని గాడిన పెట్టాలని ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ కావడం లేదనే టాక్ విన్పిస్తోంది. ఈ పరిస్థితుల నుంచి టీడీపీని ఎలా గట్టెక్కుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!