నవతరం కథానాయకుల తకధిమితైలకు సరితూగేలా సరిగమలు పలికిస్తున్నారు థమన్. టాప్ స్టార్స్ సినిమాల్లోనూ థమన్ పదనిసలు పరమానందం పంచుతున్నాయి. నేటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ థమన్ బాణీలతో సావాసం చేయాలని తపిస్తున్నారు. వారి ఇమేజ్ కు తగ్గ స్వరకల్పన చేయడంలో థమన్ బిజీ బిజీగా సాగుతున్నారు. తెలుగు సినిమా రంగం చూసిన చివరి బ్లాక్ బస్టర్ ఏది అంటే ‘అల…వైకుంఠపురములో’ పేరే వినిపిస్తుంది. 2020 సంక్రాంతి సంబరాల్లో జనం ముందు నిలచిన ‘అల…వైకుంఠపురములో’ పాటలు ఏ తీరున అలరించాయో చెప్పక్కర్లేదు. అందులోని మూడు పాటలు జనాన్ని ఊపేశాయి. ఈ నాటికీ ఆ పాటలు అలరిస్తూనే ఉండడం విశేషం! చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు కొత్త సినిమాల్లో థమన్ బాణీలే సందడి చేయనున్నాయి.
థమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. థమన్ ముద్దు పేరు. అదే అసలు పేరుగా నిలచింది. 1983 నవంబర్ 16న థమన్ జన్మించారు. ఆయన తండ్రి ఘంటసాల శివకుమార్ డ్రమ్మర్ గా వందలాది చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా చక్రవర్తి సంగీతం సమకూర్చిన 800 చిత్రాలలో శివకుమార్ డ్రమ్స్ వినిపించాయి. ఏయన్నార్ ను సినిమా రంగానికి పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య మనవడే థమన్. ఆయన తల్లి ఘంటసాల సావిత్రి కూడా గాయని. ప్రముఖ గాయని బి.వసంత, థమన్ కు సమీపబంధువు. ఇలా అందరికీ సంగీత పరిచయం ఉన్న కారణంగా థమన్ కు కూడా చిన్నప్పటి నుంచీ మ్యూజిక్ సెన్స్ బాగుండేది. తండ్రి మరణించిన తరువాత థమన్ పలువురు సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. అదే సమయంలో శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ చిత్రంలో సిద్ధార్థ ఫ్రెండ్ కృష్ణ పాత్రలో నటించారు థమన్. అయితే నటన తనకు అచ్చిరాదని తెలుసుకున్న థమన్, సరిగమలతోనే సాగాలని నిర్ణయించుకున్నారు. అయితే అడపాదడపా అలా తెరపై తళుక్కుమంటూ ఉంటారు. ‘బీభత్సం’ అనే చిత్రానికి తొలుత స్వరకల్పన చేసినా, ముందుగా ‘మళ్ళి మళ్ళి’ చిత్రం విడుదలయింది. ఆ సినిమాలో థమన్ సంగీతం ఆకట్టుకోవడంతో సురేందర్ రెడ్డి, రవితేజతో తెరకెక్కించిన ‘కిక్’కు అవకాశం కల్పించారు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయింది. తరువాత “ఆంజనేయులు, శంఖం, మిరపకాయ్, బృందావనం, దూకుడు, బిజినెస్ మేన్, నాయక్” చిత్రాలలో థమన్ బాణీలు భలేగా సందడి చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన సంగీతం కోసం హీరోలే వేచి ఉండే స్థాయికి ఎదిగారు.
ప్రస్తుతం థమన్ బాణీల్లోనే బాలకృష్ణ ‘అఖండ’ ముస్తాబై త్వరలోనే జనం ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’కు కూడా థమన్ సంగీతం సమకూర్చారు. మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’ సినిమాకు, ఆయన తరువాతి చిత్రానికి కూడా థమన్ స్వరకల్పన చేయనున్నారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందించనున్నారు. ఇవి కాకుండా, “గని, థ్యాంక్యూ, రామ్ చరణ్ కొత్త సినిమా” కూడా థమన్ బాణీలతోనే సందడి చేయనున్నాయి. సంగీత దర్శకునిగానే కాదు, గాయకునిగానూ థమన్ తనదైన బాణీ పలికించారు. థమన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరింతగా జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.