ఏపీ ఉద్యోగులంతా ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుకున్నారు. సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీకి ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, ఉద్యోగులంతా పీఆర్సీ ప్రకటనతో నిరాశ చెందారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించిన రివర్స్ పీఆర్సీకీ నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడుతానన్నారు.
రేపు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన ఇంట్లో దీక్ష చేస్తానని వెల్లడించారు. జగనన్న ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీని కానుకగా ఇచ్చారని, ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, ఉద్యోగులకు సంఘీభావంగా రేపు దీక్ష చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలిపాలని ఆయన కోరారు.