ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా నేపథ్యంలో మూతబడిన సంస్థలు ఎన్ని అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. అయితే, రాష్ర్టాలవారీగా ఎన్ని సంస్థలు మూతపడ్డాయన్న వివరాలు మాత్రం లేవని తెలిపారు.
Read Also: రికార్డుస్థాయికి వంకాయ ధర.. మార్కెట్‌లోనే కిలో రూ.100..!
గత ఆరేళ్ల కాలంలో అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,36,262 సంస్థలు మూతబడినట్లు పేర్కొన్న ఇంద్రజిత్ సింగ్.. 2018-19లో 1,43,233 సంస్థలు, 2016-17లో 12,808, 2019-20లో 70,972, 2020-21లో 14,674 సంస్థలు మూతపడ్డాయని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా 22,557 సంస్థలు డీరిజిస్టర్ అయినట్లు తెలిపారు.. మరోవైపు ఇదే సమంలో 7,17,049 సంస్థలు నమోదైనట్లు.. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,09,098 కొత్త సంస్థలు వచ్చినట్లు చెప్పారు. అయితే, ఓవైపు సంస్థలు మూతపడుతుంటే.. మరో వైపు కొత్త సంస్థలు కూడా ఏర్పాటు అవుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా దాదాపు ఆరేళ్ల కాలంలో 5 లక్షలకు పైగా సంస్థలు మూతపడితే.. 7 లక్షలకు పైగా కొత్త సంస్థలు ఏర్పాటు అయ్యాయి.