తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కూడా అంతే దూరం ఉంటుందని కేసీఆర్ గుర్తించాలన్నారు.
Read Also: అసంతృప్తి జ్వాలలు రగిలించిన టీఆర్ఎస్ ప్లీనరీ
మరోవైపు రాజకీయ శూన్యత వల్లే తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. తమకు 151 స్థానాలు వచ్చిన తర్వాత ఏపీలో శూన్యత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. తమ సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అటు గురువారం నాడు తన గురించి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పైనా పేర్ని నాని స్పందించారు. ప్రతిరోజూ రాజకీయాల్లో ఉండాలనుకునేవారు అలాగే మాట్లాడతారని సెటైర్ వేశారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలి కాబట్టి ఏదేదో మాట్లాడతారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదన్నారు. ఏ పార్టీ వారైనా డైరెక్టుగా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకున్నదే తన అభిప్రాయమని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు.