ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నేతృత్వంలోనే జరగాలనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించబోతున్నారు. దానికి ఉదాహరణంగా నిన్న రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశాన్ని పేర్కొవచ్చు. ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే, సినిమా పరిశ్రమ కోరుకున్నదే జగన్ చేయబోతున్నారన్న భావన ఎవరికైనా కలుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎంతవరకూ సమంజసం అనే చర్చ ఒకవైపు జరుగుతున్నా… థియేటర్లు కొన్నేళ్ళుగా టిక్కెట్ అమ్మకాల విషయంలో పారదర్శకంగా ఉండటం లేదని, స్థానిక అధికారులను ప్రలోభాలకు గురి చేసి పన్ను ఎగవేస్తున్నాయనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. నిజానికి థియేటర్లు టిక్కెట్ రేట్లను ప్రభుత్వానికి చూపిస్తున్న దానికి ఆరేడు రెట్లు అధికంగా కౌంటర్లలో అమ్ముతున్నారని తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వం ఈ యేడాది మార్చిలో టిక్కెట్ రేట్ల విషయంలో కఠిన వైఖరిని అవలంబించడంతో ఎగ్జిబిటర్స్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. థియేటర్ల మెయింటెనెన్స్ కు నెలకు సుమారు మూడు, నాలుగు లక్షలు ఖర్చుపెట్టే సింగిల్ థియేటర్ల యజమానులు ఆదాయం మాత్రం యాభై వేలే చూపిస్తుంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎగ్జిబిటర్ తెలిపారు. సినిమాలను బయ్యర్లకు అమ్మినప్పుడు వచ్చే మొత్తం తప్పితే, సినిమా ఎంత విజయాన్ని సాధించినా, ఎగ్జిబిటర్స్ నుండి రూపాయి కూడా వెనక్కి రావడం లేదన్నది నిర్మాతల ఆవేదన. కొన్నేళ్ళుగా తమకు రావాల్సిన డబ్బుల్ని ఎగ్జిబిటర్స్ ఇవ్వకుండా దాటవేస్తున్నారనీ మీడియం బడ్జెట్ మూవీస్ ను విడుదల చేసే నిర్మాత వాపోయారు. సహజంగానే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ ఈ విషయంలో నిర్మాతల పక్షాన నిలబడి ఎగ్జిబిషన్ రంగంలో జరుగుతున్న అవకతవకలను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరడంలో తప్పులేదనిపిస్తుంది. పేర్ని నాని నిన్న మీడియా సమావేశంలో ఈ డిమాండ్ సినిమా రంగం నుండి వచ్చిందని చెప్పడంలో ఆంతర్యం అదే. సినిమా ప్రొడ్యూసర్, బయ్యర్, ఎగ్జిబిటర్స్ మధ్య ఒకరికి ఒకరి పట్ల నమ్మకం లేకపోవడం వల్లే ఈ డిమాండ్ వచ్చిందని పేర్ని నాని తెలిపారు.
దానితో పాటు కేంద్రం 2002 నుండి ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాలతో జరుపుతున్న చర్చనూ పేర్ని నాని వెల్లడించారు. గడిచిన 18 సంవత్సరాలుగా ఆన్ లైన్ టిక్కెటింగ్ విషయంలో వివిధ శాఖలతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సమావేశాలు, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి జీవోలతో సహా నాని బయట పెట్టడంతో చాలామంది తేలు కుట్టిన దొంగలు మాదిరి అయిపోయారు.
మొత్తం టిక్కెట్లను విక్రయించేది ప్రభుత్వమే!
మంగళవారం పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశంలో మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంతవరకూ ఆన్ లైన్ టిక్కెట్ల ద్వారా సినిమా థియేటర్ల కెపాసిటీలోని నలభై నుండి అరవైశాతం టిక్కెట్లను మాత్రమే అమ్ముతున్నారు. మిగిలిన టిక్కెట్లను థియేటర్లలోని కౌంటర్లలో అమ్ముతున్నారు. అయితే… ఒకసారి ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్ని తరగతుల టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారానే అమ్ముతారు. అలానే ఇప్పటికే సినిమా టిక్కెట్లను విక్రయిస్తున్న ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్స్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేయాలి లేదా ఆ రంగం నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి… ప్రతి సినిమా టిక్కెట్ అమ్మకంపైనా పక్కాగా లెక్క ఉంటుంది. దానికి తప్పనిసరిగా సదరు వ్యక్తి ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే! తప్పించుకునే ఆస్కారమే ఉండదు!!
కొన్ని గంటల్లోనే ఎగ్జిబిటర్స్ కు వాపస్!
ఎ.పి. ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ అమ్మకాల సాధ్యాసాధ్యాలను గురించి కమిటీ వేయగానే, టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిగా చూపించి ప్రభుత్వం అప్పులు చేయబోతోందనే ఆరోపణ ఒకటి వచ్చింది. అలానే టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుందని, ఎగ్జిబిటర్స్ కు వెంటనే ఇవ్వదని, దానికి కోసం వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మాదిరి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్లాల్సి ఉంటుందని మరో వాదన కూడా వచ్చింది. అయితే… ఈ విషయమై పేర్ని నాని స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన అమ్మకాల మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులను, ఎగ్జిబిటర్స్ కు చెందాల్సిన మొత్తాన్ని వారి వారి ఖాతాలో మర్నాడు ఉదయమే జమ చేసే విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. నిజానికి ఆన్ లైన్ లో టిక్కెట్లను అమ్ముతున్న పోర్టల్స్ 24 గంటలలో ఎగ్జిబిటర్స్ కు డబ్బులు వాపసు చేస్తున్నాయనే కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తలలోనూ నిజం లేదు. బుక్ మై షో వంటి సంస్థలు వారంలో రెండు సార్లుగా ఎగ్జిబిటర్స్ కు టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇస్తున్నట్టు ఓ ఎగ్జిబిటర్ తెలిపారు.
తెలంగాణలో ఫెయిల్ అయ్యింది ఎక్కడ!?
ఏ.పి. ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల గురించి ఆలోచన చేయకముందే తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ రకమైన ప్రయత్నం చేశారు. సినిమా టిక్కెట్లను విక్రయించే ఆన్ లైన్ పోర్టల్స్ అధికమొత్తాన్ని సర్వీస్ ఛార్జీల రూపంలో వసులు చేస్తున్నాయని, దానిని అరికట్టడం కోసం ప్రభుత్వమే ఎఫ్.డి.సి. ద్వారా ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లను విక్రయించే ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. దానిపై కొంత కసరత్తు కూడా జరిగింది. అయితే… ఆన్ లైన్ పోర్టల్స్ థియేటర్లకు తమ కమిషన్ లోని కొంత మొత్తాన్ని అదనంగా అందిస్తున్నాయి. ఆ పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా, టిక్కెట్ రేట్లలో కోత పెట్టి ఎగ్జిబిటర్స్ కు ఇవ్వాలని చూసింది. దాంతో వారు కోర్టుకు వెళ్ళి ప్రభుత్వ ఆన్ లైన్ అమ్మకాలపై స్టే తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుని, పకడ్బందీగా ఏపీలో సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ అమ్మకాల వ్యవహారాన్ని అతి త్వరలోనే పట్టాలెక్కించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా ఉన్న పేర్ని నాని గతంలో తమ శాఖ ఆదాయానికి గండిపడేలా చేసిన దివాకర్ రెడ్డి అండ్ కో అలానే కోడెల శివప్రసాద్ తనయుడు అక్రమాలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం ఆయన దృష్టి సినిమా టిక్కెట్ అమ్మకాలలో జరుగుతున్న అవకతవకలపై పడింది. అందుకే ఆయన తగ్గేదేలే అంటున్నారు. పైకి ఈ విధానం అమలులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నా… అది అతి త్వరలోనే అమలు జరిగే ఆస్కారం కనిపిస్తోంది.