రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఒక పార్టీ బీ ఫాం తీసుకుని గెలిచి.. వెంటనే మరో పార్టీలో చేరడం మామూలే. హైదరాబాద్లో బీజేపీ తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ కార్పోరేటర్లు పార్టీలు మారడం పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. తాజాగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన కార్పొరేటర్ నరేంద్రకుమార్ పార్టీ మారారు. బీజేపీ తరఫున గెలిచి నిన్న టీఆర్ఎస్ లో చేరారు కార్పొరేటర్ నరేంద్రకుమార్.
బీజేపీలో గెలిచి పార్టీ మారడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కార్పొరేటర్ నరేంద్రకుమార్ ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో నరేంద్రకుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తాను ఆకర్షితుడిని అయ్యానని కార్పొరేటర్ నరేంద్రకుమార్ అంటున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మీర్ పేట 13వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. నరేంద్రను పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సబిత.
నరేంద్రకుమార్ బాటలోనే మరికొందరు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. మీర్ పేట, బడంగ్ పేటలో బీజేపీ తరఫున గెలిచినవారు కండువాలు మార్చేపనిలో పడడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ తరఫున గెలిచి ఇతర పార్టీలో చేరడం ఏంటని, ముందు రాజీనామా చేసి పార్టీ మారాలంటున్నారు. నరేంద్రకుమార్ తీరుపై బీజేపీ క్యాడర్ అసహనంతో వుంది.