ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా..! ఈ మూడు సోషల్ మీడియా యాప్స్ మన జీవితంలో భాగమైపోయాయి. ఉదయం నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే కాలక్షేపం. అన్ని అప్డేట్స్ అందులోనే చూసి తెలుసుకుంటున్నాం..! ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ఐతే సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక… వివాదాలు మొదలయ్యాయి. ఫేక్‌న్యూస్‌పై జూకర్‌బర్గ్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాట్సాప్, ఇన్‌స్టాలకు కూడా ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీలా ఉంది.
దాంతో వివాదాలతో ఫేస్‌బుక్ ప్రతిష్ట దిగజారుతుందని భావించిన ఆ సంస్థ…కంపెనీ పేరు మార్చాలని నిర్ణయించింది. భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా ”మెటా” గా మార్చేసింది. ఫేస్‌బుక్ వార్షిక సమావేశంలో ఈ పేరును ప్రకటించారు జూకర్ బెర్గ్. డిజిటల్ రియాల్టీ అయిన మెటావర్స్‌కు చిన్నపేరే మెటా. ఐతే కంపెనీ పేరు మార్చినా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా యాప్స్ మాత్రం అలాగే కొనసాగుతాయి. పేరు మార్పు వెనుక భారీ ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకుంది ఫేస్‌బుక్.
వచ్చే ఐదేళ్లలో యూరప్ మార్కెట్‌ను శాసించాలని టార్గెట్ పెట్టుకుంది. దీంతో పాటు సాధ్యమైనంత త్వరగా మెటావర్స్‌ను బిల్డ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెటావర్స్‌లోనే ఆగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఆన్‌లైన్ గేమింగ్ ఉండనున్నాయి. వీటి మీదనే కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉందని చెబుతోంది ఫేస్‌బుక్. ఇప్పటికే మెటావర్స్‌పై జూకర్ బెర్గ్ వివరణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో చాలా ప్రభావవంతంగా పనిచేయబోతోందని చెప్పారు. మెటావర్స్ మొబైల్ ఇంటర్నెట్‌ను శాసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలలు శ్రమించి కంపెనీ పేరు మెటావర్స్‌గా మార్చారు. ఇక నుంచి ఫేస్‌బుక్ పేరు వింటే మెటావర్స్ కంపెనీ గుర్తుకువస్తుందని చెబుతున్నారు.