తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.
పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి కేటీ రామారావుకు ధన్యవాదాలు తెలిపారు.
మలావత్ పూర్ణ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన విద్యార్ధిని. ఎవరెస్టు శిఖరం అధిరోహించేనాటికి ఈమె నిజామాబాదు జిల్లాలోని తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు లక్ష్మీ, దేవదాస్ లు. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. హైదరాబాద్ కేంద్రంగా సాహస కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ ఈ విద్యార్థులు ఎవరెస్ట్ వెళ్లటానికి సహాయ సహకారాలు అందించింది. గతంలో నేపాల్‌లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పింది. పూర్ణ 13 ఏళ్ల 11 నెలల వయస్సులోనే ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. పూర్ణ అతి పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా చరిత్ర నెలకొల్పింది.
52 రోజులపాటు సాగిన వీరి యాత్ర మే 25, 2014 ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ఊహించిన సమయంకన్నా ముందే ఎవరెస్టును అధిరోహించింది. ఈమెతో పాటు ఈ యాత్రలో మాలవత్ పూర్ణ ఎస్.ఆనంద్‌కుమార్ తో కలసి ఈ సాహసయాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు. వీరిద్దరూ మూడురంగుల జెండాను ఆ శిఖరంపై పాతి దేశభక్తి గీతం ఆలపించారు.