‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే.. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్ వివరించారు.
అక్టోబరు 2వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఇక నిబంధనల విషయానికి వస్తే.. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి.
కాగా, ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ మా ఎన్నికలలో పాల్గొనబోతున్నారు.