(ఆగస్టు 30న రమేశ్ ప్రసాద్ పుట్టినరోజు)
ఓ వైపు హైటెక్ సిటీ, మరో వైపు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ భాగ్యనగరానికి మరింత శోభను తీసుకు వచ్చాయి. ప్రసాద్ సంస్థ తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు మరెవరో కాదు ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు ఎల్.వి.ప్రసాద్. ఆయన నెలకొల్పిన ప్రసాద్ సంస్థలు అనేకం చిత్రసీమలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ లో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ విషయం అందరికీ తెలిసిందే. దేశం గర్వించదగ్గ నేత్రాలయాల్లో ఎల్వీ ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ ఒకటి. ఈ సంస్థలన్నీ ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ నిర్వహణలో సాగుతున్నాయి. రమేశ్ ప్రసాద్ ఎప్పటికప్పుడూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ తమ ఫిలిమ్ ల్యాబ్స్ ను వృద్ధి చేశారు. డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగానూ ప్రసాద్ సంస్థలు సాగుతున్నాయి. చిత్రసీమలో తాము సంపాదించింది మళ్ళీ సినిమా రంగానికే వినియోగించాలి అన్న తండ్రి ఎల్వీ ప్రసాద్ మాటను తు.చ. తప్పక పాటిస్తూ పయనిస్తున్నారు రమేశ్ ప్రసాద్.
రమేశ్ ప్రసాద్ చిన్నతనం నుంచీ తండ్రి ఎల్వీ ప్రసాద్ బాటలో పయనించారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, ఒదిగి ఉండే గుణాన్ని అలవరచుకున్నారు. అమెరికాలో బి.ఇ.ఎమ్.ఎస్. పట్టా పుచ్చుకున్న తరువాత స్వదేశం వచ్చాక 1974లో ప్రసాద్ ఫిలిమ్ ల్యాబ్స్ ఆరంభించారు. అంతకు ముందు తన తండ్రి ప్రసాద్ ఫిలిమ్స్ సంస్థలోనూ నిర్మాణవ్యవహారాలు చూసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించిన అనేక చిత్రాలను ఎల్వీ ప్రసాద్ తమ ప్రసాద్ ఫిలిమ్స్ పతాకంపై హిందీలో పునర్నిర్మించారు. ఆ చిత్రాలలో చాలా వాటికి రమేశ్ ప్రసాద్ నిర్మాణవ్యవహారాలు చూసుకున్నారు. రమేశ్ ప్రసాద్ నేతృత్వంలోనే ప్రసాద్ ల్యాబ్స్ దేశంలోని అనేక ప్రధాన నగరాలలో విస్తరించింది. అమెరికా, దుబాయ్, సింగపూర్ లోనూ ప్రసాద్ సంస్థలు నెలకొన్నాయి. వాటన్నిటి వెనుకా రమేశ్ ప్రసాద్ కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయని చెప్పక తప్పదు. 1988-1989 మధ్యకాలంలో ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ గానూ రమేశ్ ప్రసాద్ వ్యవహరించారు. ఇండియాలో తొలి ఐమాక్స్ థియేటర్ నిర్మించిన ఘనత రమేశ్ ప్రసాద్ సొంతం. కరోనా ప్యాండమిక్ తరువాత మరికొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రస్తుతం ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ ను తీర్చిదిద్దారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ తరువాత హైదరాబాద్ లో అనేక మల్టీప్లెక్స్ థియేటర్స్ రూపొందాయి. అయినా ఇప్పటికీ ప్రసాద్ మల్టీప్లెక్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రసాద్స్ లో సినిమా చూస్తేనే థ్రిల్ ఫీలయ్యే సినీ ఫ్యాన్స్ కొందరున్నారు.. దీనిని బట్టే ఆ థియేటర్లను రమేశ్ ప్రసాద్ ఎంత శ్రద్ధతో నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా తండ్రి ఎల్వీ ప్రసాద్ చూపిన బాటలో సాగుతున్న రమేశ్ ప్రసాద్ ధన్యజీవి. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.