ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నిర్వహించిన బీఏసీ సమావేశానికి చంద్రబాబు వస్తారని తాము భావించామని.. కానీ ఆయన బీఏసీకి రాలేదని జగన్ తెలిపారు. కొంచెం సేపు బీఏసీ సమావేశాన్ని తాము ఆలస్యం చేశామని.. అయినా చంద్రబాబు రాలేదని.. ఆయనకు ఏం కష్టం వచ్చిందో తనకైతే తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుపై కుప్పం ఎన్నికల ఎఫెక్ట్ పడిందని మా వాళ్లు చెప్తున్నారు’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
Read Also: అందుకే కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు మొట్టికాయలు వేశారు: జగన్
మహిళా సాధికారతపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు కూడా పాల్గొంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. కుప్పంలో ఓటమితోనైనా చంద్రబాబు మారతాడని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. కుప్పం లాంటి చోట్ల కూడా మహిళలు వైసీపీకి పట్టం కట్టారని.. అక్కాచెల్లెమ్మల విసయంలో ఎలా ఉండాలో ఇప్పటికైనా చంద్రబాబుకు అర్థమైతే సంతోషకరమన్నారు. మరోవైపు ఏపీలో సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చామని, గత ప్రభుత్వం ఎగ్గొడితే తామే చెల్లించామని జగన్ చెప్పారు. 36.70 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, అమ్మఒడి ద్వారా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అలాగే 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించామని, అదనపు ఆదాయం పొందేలా వ్యాపారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని జగన్ తెలిపారు.