అందుకే కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు మొట్టికాయలు వేశారు: జగన్

ఏపీలో రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. ఏపీలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని… మొత్తం 1.21 కోట్ల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని జగన్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు వెళ్లి, కేసులు వేసి ఆపాలని చూశారని… మంచి పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని జగన్ ఆరోపించారు. అందుకే కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు మొట్టికాయలు వేశారని జగన్ ఎద్దేవా చేశారు.

తమ ప్రభుత్వం మహిళల సాధికారతగా పనిచేస్తోందని… తొలిసారిగా ఎస్‌ఈసీగా మహిళను నియమించామని, కేబినెట్‌లో మహిళలకు పెద్దపీట వేశామని, వాలంటీర్లలో 53 శాతం మహిళలనే నియమించామని, మహిళల కోసం దిశా చట్టం చేశామని… దిశా యాప్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని జగన్ గుర్తుచేశారు. మహిళలు ఆనందంగా ఉండాలని ఏపీలో పర్మిట్ రూంలను మూసివేయించామని… రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరపడం లేదని జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో రోజుకు రాష్ట్రంలో 1.71 లక్షల కేసుల బీర్లు అమ్మేవారు అని.. తమ ప్రభుత్వంలో మద్యం నియంత్రణ చేసేందుకు ధరలు విపరీతంగా పెంచడంతో రోజుకు 71 లక్షల కేసులు బీర్లు మాత్రమే విక్రయిస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు.

Read Also: వరదలతో చిత్తూరు జిల్లా ఉక్కిరిబిక్కిరి

సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చామని జగన్ తెలిపారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చామని… కాపు నేస్తం ద్వారా మహిళలకు అండగా నిలబడ్డామని జగన్ తెలిపారు. 3లక్షల 28 వేల మందికి రూ.982 కోట్ల మేర మేలు చేశామని… ఈబీసీ నేస్తం అనే కొత​ పథకానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేస్తామని జగన్ ప్రకటించారు.

Related Articles

Latest Articles