వైసీపీ నేతలకు పని లేక ఆడవారిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నిజంగా భువనేశ్వరిని కించపరిచినట్లు మాట్లాడినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారని మంత్రి కొడాలి నాని అన్నారు. తాము విమర్శలు చేయకున్నా చేశామని చెప్పిన్నోళ్లు కూడా సంకనాకి పోతారని చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అసెంబ్లీలో రోజాను కంటతడి పెట్టించారని, లక్ష్మీపార్వతిని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకువెళ్లారని.. దానికి ఫలితంగానే చంద్రబాబు ఇప్పుడు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడో చూస్తున్నామని కొడాలి నాని మాట్లాడారు.
Read Also: వైసీపీ నేతలకు నారా భువనేశ్వరి కౌంటర్
అటు ఓటీఎస్ పథకంపై కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఈ పథకం వల్ల పేదవారు సొంతింటి వారు అవుతుంటే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని ఓర్చలేక తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని.. తెలుగు దేశం పార్టీ వాళ్లను తీసుకొచ్చి మీడియా ముందు పెడబొబ్బలు పెట్టినంత మాత్రాన తమ ప్రభుత్వానికి పోయేదేమీ లేదన్నారు. ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు మంచి జరుగుతుందని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. చంద్రబాబు తన జీవితంలో ఓటీఎస్ లాంటి పథకాన్ని తీసుకురాలేడని ఎద్దేవా చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌పైనా మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయాలో సలహాలు ఇవ్వడానికి పవన్ ఏమీ తమ వ్యూహకర్త కాదని.. తమకు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని సెటైర్ వేశారు. పవన్ ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే బీజేపీకో, చంద్రబాబు ఇచ్చుకోవాలని హితవు పలికారు.