కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజకు మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు.. కోవిడ్ కట్టడికి ఆమె చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.. దీంతో.. మళ్లీ ఆమె ఆరోగ్యశాఖ మంత్రి అనే ప్రచారం జరిగింది. కానీ, సీపీఎం తీసుకున్న ఓ నిర్ణయంతో.. ఆమెతో పాటు పాత మంత్రులకు ఎవరికీ అవకాశం దక్కలేదు.. సీఎం పినరాయి విజయన్ మినహా పాత వారు ఎవరూ కేబినెట్‌లో లేకుండా పోయారు.. అయితే, శైలజా టీచర్‌గా పేరుపొందిన ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై మాత్రం.. రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి.. ఇక, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై స్పందించారు శైలజ.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని ప్రకటించారు.
శైలజను పార్టీ విప్‌గా నియమించాలని నిర్ణయించారు పార్టీ పెద్దలు.. ఈ పరిణామాలపై ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన ఆమె.. అది పార్టీ విధాన నిర్ణయం.. ఆ మేరకు నేను కూడా తప్పుకుందామనే నిర్ణయించుకున్నాను అని స్పష్టం చేశారు.. సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఇలా ఆవేశం సహజమే అన్నారు.. నేను కూడా ఒకప్పుడు కొత్తమంత్రినే కదా అని ప్రశ్నించిన ఆమె.. కొత్త బాధ్యతలు అప్పజెప్పినప్పుడు అందరూ అనుభవం లేనివారే కదా.. మా పార్టీలో ఎందరో ఉన్నారు.. అవకాశం దొరికితే వారూ కష్టపడి పనిచేస్తారు అని తెలిపారు. పైగా నా ఒక్కదాన్నే పక్కన పెట్టలేదు కదా.. అని ప్రశ్నించిన శైలజా టీచర్.. ఏ ఒక్క మంత్రికీ తిరిగి పదవి ఇవ్వరాదని తీర్మానించారు అనే విషయాన్ని గుర్తుచేశారు. ఇక, గత ఐదేళ్ల పదవీకాలం గురించి ప్రస్తావిస్తూ.. సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం గర్వంగా ఉందన్నారు. కాగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. 60 వేల ఓట్ల రికార్డు మెజార్టీతో గెలిచారు శైలజ.. గతంలో ఆమె కృషికి ప్రశంసలు దక్కగా.. మరోసారి ఆమెకు కీలక బాధ్యతలు ఇస్తారని భావించారు.. కానీ, పార్టీ విధాన నిర్ణయంతో.. ఆమెతో పాటు సీనియర్లు ఎవరికీ చోటు దక్కలేదు. శైలజతో సహా పాత మంత్రులెవరినీ కొత్త కేబినెట్‌లోకి తీసుకోరాదని సీపీఎం నిర్ణయించింది. కేబినెట్‌లో అంతా కొత్తవారే ఉంటారని పార్టీ నిర్ణయించింది. సీఎం పినరాయి విజయన్ కు మాత్రమే పార్టీ మినహాయింపు ఇచ్చారు. మరోవైపు.. ఈసారి విజయన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉండబోతున్నారు.