ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హస్తిన బాట పట్టారు.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈలోపే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.
మరోవైపు.. తెలంగాణ నేతలు ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు అంటూ ఈ నెల 1వ తేదీన వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజులుగా అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరలను కలిశారు.. ఇవాళ రాత్రికి కూడా ఆయన అక్కడే బసచేసి.. రేపు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి, కొత్త కమిటీల నియామకం తర్వాత.. తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రేపు సమావేశం కానున్నారు రాహుల్ గాంధీ.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల నేతల పర్యటనలో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే, పవన్ కల్యాణ్ పర్యటన వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.