మాజీ విద్యార్థి నాయకుడు .. సీపీఐ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అందుకే రాహుల్‌గాంధీని కలిశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి. JNU students Uninion మాజీ అధ్యక్షుడైన కన్నయ్య కుమార్ మంచి వక్త. మోదీ పాలనపై తరచూ విరుచుకుపడుతుంటాడు. మంచి వాగ్ధాటి కలిగిన యువనేత. అందుకే కాంగ్రెస్ పార్టీ కన్నయ్యపై కన్నేసినట్టు కనిపిస్తోంది.
కన్నయ్య కుమార్‌తో పాటు గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్ లోకి వెళతారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గామ్ స్థానంలో అభ్యర్థిని పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మేవానీకి మద్దతిచ్చింది. గుజరాత్ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో మేవానిని పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జిగ్నేష్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం కన్నయ్య కుమార్ సిపిఐలో ఇమడలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. పార్టీ వీడే యోచనలో ఉన్నాడని..మంగళవారం రాహుల్ గాంధీతో సమావేశం అందులో భాగమని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అవి ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేశారు. ఈ నెల ప్రారంభంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ఉన్నారని, సమావేశం సందర్భంగా జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్నారని ఆయన చెప్పారు.
మరోవైపు, కాంగ్రెస్ ఆఫర్‌కు కుమార్ ఇప్పటి వరకు పాజిటివ్‌గా స్పందించనప్పటికీ, బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి ఆసక్తి చూపుతున్నాడని మాత్రం హస్తం పార్టీ వారు అంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా బీహార్‌లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరాశే ఎదురైంది. మిత్రపక్షాలైన RJD , CPI (ML) తో పోల్చినప్పుడు కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పోటీ చేసిన 70 సీట్లలో 19 మాత్రమే గెలవటం హస్తం దుస్థితికి అద్దంపడుతోంది. ఆర్జేడీ పోటీ చేసిన 144 సీట్లలో సగానికి పైగా గెలుపొందగా, సిపిఐ (ఎంఎల్) 19 స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకుంది.
అన్నిటిని మించి ఇప్పుడు కాంగ్రెస్‌లో బలమైన యువనేతలు కరువయ్యారు. ఉన్న ఒకరిద్దరు కూడా పార్టీని వీడారు. ఈ తరుణంలోకన్నయ్య, జిగ్నేష్ ల ఎంట్రీ పార్టీలో యువతకు బూస్ట్‌లా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది. గత రెండేళ్లలో యువనేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు సుస్మితా దేవ్, జితిన్ ప్రసాద, ప్రియాంక చతుర్వేది వంటి వారు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
అయితే కన్నయ్య కుమార్ వివాదాస్పద గతం తమకు భారంగా మారుతుందని కాంగ్రెస్‌లో కొందరు అంటున్నారు. సిపిఐలో కూడా చిన్నపాటి క్రమశిక్షణ చర్యను ఎదుర్కొన్నారు. పార్టీ పాట్నా కార్యాలయంలో జరిగిన గంధరగోళానికి సంబంధించి కుమార్‌పై పార్టీ చర్య తీసుకుంది. అయతే అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు.
ఏదెలా ఉన్నా కన్నయ్య మంచి వక్త. తన వాగ్దాటితో యువతను ఆకర్షించగలడు. పార్టీలో చేరితే వచ్చే యూపీ ఎన్నికల్లో పూర్వాంచల్ ప్రచారానికి వాడుకోవచ్చని కాంగ్రెస్ బావిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టేది లేదని ఎస్‌పి, బిఎస్‌పి స్పష్టం చేశాయి. దాంతో హస్తానికి ఒంటరి ప్రయాణం తప్పేలా లేదు.
నిజానికి కన్నయ్య కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నారాయన. రాజకీయాల్లో రకరకాల వ్యక్తులను కలుస్తామని..వాటిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదని చెప్పారాయన. అయితే ఇటీవల రెండు సార్లు ఆయన రాహుల్‌ని కలిశారని.. ఈ రెండు సందర్భాలలో వారితో పాటు ప్రశాంత్ కిశోర్ కూడా వారితో ఉన్నారని సమాచారం. పార్టీలో చేరికపై సంప్రదింపులు ప్రస్తుతం ఆఖరు దశలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎప్పటిలాగే కన్నయ్య అలాంటి సమావేశాలేమీ జరగలేదని అంటున్నారు.
కాంగ్రెస్ నాయకుడు నదీం జావెద్‌తో కన్నయ్య కుమార్ కలిసి ఉన్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నదీం ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. దాంతో కన్నయ్య కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని నదీం, తాను లంచ్ సందర్భంగా తీసిన ఫొటోని ఆయన సోషల్ మీడియా అక్కౌంట్లలో పోస్ట్ చేశాడని కన్నయ్య వివరించాడు. ఇక ప్రశాంత్ కిశోర్ విషయానికొస్తే 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయనప్పటి నుంచి టచ్‌లో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.
తనపై క్రమశిక్షణ చర్య తీసుకున్నప్పటి నుంచి కన్నయ్య కుమార్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఆయనతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను జాన్ పూర్ మాజీ ఎమ్మెల్యే నదీమ్‌పై ఉంచినట్టు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందులో భాగంగానే వారిద్దరు పలు మార్లు కలిసినట్టు తెలుస్తోంది.
బీహార్‌లో కాంగ్రెస్ తన ఉనికి కోసం పాట్లు పడుతోంది. పార్టీ శ్రేణులలో ధైర్యం నింపగల నేత కోసం చూస్తోంది. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పదంటే పది సీట్లు మాత్రమే గెలవగలిగింది ఇక 2010లో మరీ ఘోరం.. నాలుగు సీట్లే వచ్చాయి. 2015లో RJD,JD-Uతో కలిసి 27 సీట్లు గెలిచింది. కానీ 2020లో మళ్లీ పాత కథే. దాని బలం 19కి పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే గెలవగలిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాట్నా గాంధీ మైదాన్‌లో జన గన మన ర్యాలీ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కన్నయ్య కుమార్‌పై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, అవదీశ్ సింగ్ అదే వేదికను పంచుకోవటం జనాలను ఆశ్చర్య పరిచింది. అయితే సిటిజన్‌షిప్ బిల్లుపై ఐక్య పోరాటంగా దానిపై వివరణ ఇచ్చారు. గతంలో సీఎం నితీష్ కుమార్‌ని కలిసినప్పుడు కూడా ఇలాంటి వదంతులూ వచ్చాయని కన్నయ్య కుమార్ గుర్తుచేశారు. అయితే అదంతా గతం. కన్నయ్య కుమార్ ఇప్పుడు సీపీఐలో ఇమడలేకపోతున్నాడు.. పైగా కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ పిలుస్తోంది.. వచ్చేది ఎన్నికల సీజన్. రాజకీయంగా ఒకరి అవసరం ఒకరికి ఉంది. అందుకే కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలను అంత సులువుగా కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. చూద్దాం కన్నయ్య పయనం ఎటువైపో!!