ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి దిగి పనులు మొదలుపెట్టినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. త్వరలోనే మరోసారి క్యాబినెట్ విస్తరణ చేపట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఈ టీముతోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో క్యాబినెట్లో ఎవరెవరు చోటు దక్కించుకుంటారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను తిప్పికొట్టేలా ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ప్రతిపక్ష టీడీపీ ఏపీలోని ప్రధాన కులాలపై ఫోకస్ పెట్టడంతో వారిని తమవైపుకు తిప్పుకునేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని వైసీపీలో టాక్ విన్పిస్తోంది.
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. 2014లో ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీ 2019లో మాత్రం బంపర్ విక్టరీతో అధికారంలోకి వచ్చింది. కాగా 2014లో టీడీపీ పొత్తులతో బరిలో నిలిచింది. జనసేన, బీజేపీలతో కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అయితే 2019లో మాత్రం జనసేన, బీజేపీలు టీడీపీకి దూరమయ్యారు. ఆ ప్రభావం ఆ ఎన్నికల్లో స్పష్టం కన్పించింది. దీనికితోడు టీడీపీకి తొలి నుంచి మద్దతు ఇస్తున్న ఓ బలమైన సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ప్రకటించింది. ఈ కారణాలను బేరీజు వేసుకొని టీడీపీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ పొత్తులతో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ బలం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో వచ్చే ఎన్నికలకు ఆయన పొత్తులతోనే వెళ్లడం ఖాయంగా కన్పిస్తోంది. దీనిలో భాగంగానే జనసేనతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ను ముందుగానే ఊహించిన వైసీపీ ఇప్పటికే ఆపార్టీలకు అండగా నిలుస్తున్న సామాజిక వర్గాలపై దృష్టిసారించింది. కమ్మ, కాపులకు ప్రాధాన్యం ఇస్తూనే బీసీ కార్డును తెరపైకి తెస్తోంది. తద్వారా ఈ రెండు పార్టీలు కలిసినా వైసీపీపై పెద్దగా ప్రభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికలకు వైసీపీ ఒంటరిగా వెళ్లినా విజయం సాధిస్తుందనే ధీమాను ఆపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.