వచ్చే ఏడాది పంజాబ్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నిర్ణయం తీసుకొని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా పక్కనపెట్టి పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించింది. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దళితులకు సీఎం పదవి ఇచ్చామని చెప్పడమే కాకుండా పార్టీలో అంతర్గత విభేదాలకు తావులేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న ఆప్‌కు ఇది కొంత మింగుడుపడని అంశమే. కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ల మధ్య విభేదాలు నడుస్తుంటే, వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆప్ చూసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రిని మార్చడంతో పాటుగా దళిత వర్గానికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది.