‘పొరుగుంటి పుల్లకూర రుచి’ అన్నట్లుగా మనం మన విషయాల కంటే పక్కింటి సంగతులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాం. పక్కోడి విషయాలు తెలుసుకోవడంలో ఉన్న కిక్కే వేరప్పా అన్నట్లు కొందరు అదే పనిలో ఉంటారు. మరికొందరైతే చిన్న విషయాన్ని కూడా ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే చాలా స్పెషల్ గా ఉంటారు. అసలు ఏం లేకపోయినా ఏదో ఒక పుకారు సృష్టించి ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.అందుకే మన దేశంలో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసే రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అంత హిట్ అయ్యింది మరీ.. చాప అంత విషయం జరిగితే చాంతాడంత చెప్పడం మనకు అలవాటు. ఇలాంటి పుకార్లు పుట్టించడంలో ప్రపంచంలో భారతీయులను మించిన వాళ్లు లేరని తాజాగా తేలింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లదైంది..
సోషల్ మీడియాను కొందరు మంచి కోసం ఉపయోగిస్తుండగా మరికొందరేమో ఇష్టానుసారంగా ఉపయోగిస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నిజాల కంటే కూడా ఫేక్ న్యూస్ ఎక్కువయ్యాయి. దీంతో ఏది నిజం? ఏది అబద్ధం అనేది సోషల్ మీడియాలో తెలుసుకోవడం కష్టంగా మారింది. కరోనా విషయంలో ఇలాంటివి ఎక్కువగా కన్పించాయి. సోషల్ మీడియాలో కరోనాపై ఎవరికీ వారు రకరకాల పోస్టులు పెట్టడంతో పుకార్లు షికార్లు చేశాయి. కరోనా పేరు చెబితేనే ప్రజల భయపడిపోతున్న సమయంలో కొత్తకొత్తగా పుట్టికొచ్చిన పుకార్లు వారిని మరింత భయాందోళనకు గురిచేశాయి.
ఈ పుకార్లకే కొంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే సమయంలో కొన్ని తప్పుడు పోస్టులు వైరల్ గా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం జోక్యం చేసిన వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరోవైపు సైంటిస్టులు సైతం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడంతో కొంతమందికి అసలు నిజాలు తెలిసి వచ్చాయి. ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్, మందుల విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా ఈ వ్యాక్సిన్లు వాటిపై పని చేస్తాయా? లేదా అన్నట్లు పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. కరోనా టీకా డోసుల విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇలాంటి పుకార్లు మన ఇండియాలో ఎక్కువగా ప్రచారమైనట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని వేరే దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి పుకార్లు ఎక్కువగా జరుగుతున్నాయా? అనే విషయంపై ఇటీవల ఓ సర్వే జరిగింది.
మొత్తంగా 130 దేశాల్లో అసత్య ప్రచారాలు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 18.07శాతం స్కోరుతో భారత్ టాప్ ప్లేసులో నిలిచిందని సర్వే ప్రకటించింది. దీంతో పుకార్లు సృష్టించడంలో భారతీయులే తోపులని తేలిందన్న మాట. ఏదిఏమైనా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల వల్ల ఎక్కువ హానీ కలిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మాత్రం సోషల్ మీడియా నిర్వాహకులపైనే ఉంది.