కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదు కావడంతో.. ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్లాయి.. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ లాంటి నిర్ణయాలు తీసుకుని కఠినంగా అమలు చేస్తున్నాయి.. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను స్వస్తి చెప్పి.. అక్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్‌లోకి వెళ్లిపోతున్నాయి.. అయితే, అన్‌లాక్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.. అన్‌లాక్‌కు వెళ్లే సమయంలో.. రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.. చాలా నెమ్మదిగా, క్రమంగా లాక్‌డౌన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగిస్తే మంచిదని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది ఐసీఎంఆర్. దీనిపై ముఖ్యమైన మూడు సూచనలు చేశారు ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ.. అన్‌లాక్‌కు వెళ్లే సమయంలో.. అంతకు ముందు వారం రోజుల పాటు కోవిడ్-19 పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండాలని.. అనారోగ్య సమస్యలతో బాధపడే 45 ఏళ్ళ పైబడినవాళ్లలో 70 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరిగిందా కూడా పరిశీలించాలని.. ఇక, కరోనా కట్టడికి ప్రజల ప్రవర్తన మారిందా కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.