హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్ధేశించనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బలమైన ఓ ప్రచార నినాదాన్ని నిర్మించడానికి హుజూరాబాద్ విజయం దోహదం చేస్తుంది. టీఆర్ఎస్ గెలిస్తే పార్టీపై కేసీఆర్ ఉక్కు పిడికిలి మరింత బిగుసుకుంటుంది. సమీప భవిష్యత్తులో తిరుగుబాట్లను అణిచివేసేందుకు ఆయనకు ఈ విజయం సహాయపడుతుంది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హుజురాబాద్‌లో గొప్ప విజయాన్ని ఆశిస్తున్నారు. అయితే ఓడిపోయినా ఇప్పటికిప్పుడు ఆయనకు వచ్చే పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆయన బలం 102. ఐతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ గెలిచింది 88 సీట్లు..మిగతావి ఫిరాయింపులు.
ఈటల రాజేందర్‌తో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ హుజూరాబాద్‌ను కచ్చితంగా కైవసం చేసుకుంటామన్న విశ్వాసంతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి గెలుపు టీఆర్ఎస్ను అసంతృప్తికి గురిచేసింది. అలాగే హైదరాబాద్‌లో మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయం సొంత చేసుకోవటం. ఈసారి అలా జరగకూడదని టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.
హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్కు అసలు సిసలు ప్రత్యామ్నాయం తామే అనే వాదనకు బలం చేకూరుతుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు కాషాయ పార్టీకి గొప్ప ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. ఐతే మహబూబ్‌నగర్-రంగా రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దాంతో ఆ ఉత్సాహం కాస్త దెబ్బతింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీది పేలవ ప్రదర్శన. మరోవైపు, రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుని టీఆర్ఎస్ తిరిగి సత్తా చాటింది.
మరోవైపు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మునపటి కన్నా ఇప్పుడు పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అధికారాన్ని సవాలు చేసే సత్తా బీజేపీకి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలాబలాలను తక్కువ అంచనా వేయటం లేదు కాషాయ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలమైనది. రాష్ట్రం నలుమూలలా నాయకులు, క్యాడర్ని కలిగి ఉన్న పార్టీ. ఓట్ల పరంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉనికి ఉన్న పార్టీ. ఇందుకు భిన్నంగా బిజెపి కేవలం ఉత్తర తెలంగాణకే పరిమితం. ఇటీవలపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ వాస్తవాలను చూపిస్తున్నాయి. పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 40 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 24-26 శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ శాసనసభ్యులు, నాయకులు టిఆర్ఎస్లోకి వెళ్లిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తన సత్తా చాటేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేదిక అవుతోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ కొని తెచ్చుకుందనే చెప్పాలి. అది ఇప్పడు దానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక తనకు రాజకీయంగా ఎంత ముఖ్యమైనదో కేసీఆర్‌కు తెలియంది కాదు. ఈ నేపథ్యంలో భారీ సామాజిక సంక్షేమ పథకం దళితబంధు తెర మీదకు వచ్చింది. అయితే ప్రస్తుతం దీనిని ఎన్నికల సంఘం నిలిపివేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
కేసీఆర్ తన విజయాలకు కులాన్నే ప్రధానంగా నమ్ముకున్నట్టు అర్థమవుతుంది. దళితులు మాత్రమే కాదు బీసీ కులాలకు కూడా టీఆర్ఎస్ సర్కార్ తాయిలాలు ప్రకటించింది. బార్లు, వైన్ షాపులు, రెస్టారెంట్లు తదితరాల కేటాయింపుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓబీసీలకు కోటా ప్రకటించటం దీనికి ఉదాహరణ. బీసీ కులాలైన యాదవులు, ముదిరాజ్, పద్మశాలీ ఓట్లు నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. వీరి విషయంలో కూడా ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలపైనే టీఆర్ఎస్ ఆధారపడి ఉంది.
ఈ ఎన్నికలలో ఓబీసీ ఓటర్లే కీలకం కానున్నాయి. బిజెపికి అభ్యర్థి ఈటల రాజేందర్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇద్దరూ బీసీ వర్గాలకు చెందినవారు కావడం విశేషం. ఈటల రాజేందర్ శక్తివంతమైన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినవాడు. గతంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వామపక్ష భావజాలం గల విద్యార్థి నాయకుని స్థాయి నుంచి వచ్చారు. 2004లో కమలాపూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజేందర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
డీలిమిటేషన్ తరువాత హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పాటైంది. రాజేందర్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. హుజూరాబాద్‌లో బీజేపీ సొంత బలం అంతంత మాత్రమే. ఇది 2018 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 1,683 ఓట్లను సాధించింది. ఇవి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ. అయితే, హుజూరాబాద్ పరిధిలోని కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బండి సంజయ్ ఈ సెగ్మెంట్లో 26 వేలకు పైగా ఓట్లను సాధించటం గనార్హం.
రాజేందర్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటే హుజూరాబాద్‌లో తిరుగులేని నాయకుడిగా ఆయన స్థానం సుస్థిరమవుతుంది. అయితే, 2018 ఎన్నికల్లో 61 వేలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ టీఆర్ఎస్కు సమీప ప్రత్యర్థిగా నిలిచింది. రెడ్డి నాయకత్వం మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుందా అనేది చాలా మంది విశ్లేషకుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
అయితే, అధికార టీఆర్ఎస్ బలం, రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ఆయన వెనుక బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈసారికి ఇక్కడ ఓట్ల కోత పాత్రకు మాత్రమే పరిమితం కావచ్చు. కాంగ్రెస్ సాధించే ప్రతి ఓటు టీఆర్ఎస్కు ఉపయోగపడుతుందని పరిశీలకులు బావిస్తున్నారు. 1983 నుంచి ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలవలేదు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇక్కడ పెద్దగా లేదనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది.
ఏదేమైనా ఈ రాజకీయ యుద్ధానికి సమయం దగ్గర పడింది. బుధవారంతో హుజురాబాద్ ప్రచార పర్వానికి తెరపడనుంది. అంటే ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. ఈ నెల 30న జరిగే పోలింగ్‌తో హుజూరాబాద్ పోరు పరిసమాప్తమవుతుంది.
-Dr. Ramesh Babu Bhonagiri