ఆవును మనం గోమాతగా పూజిస్తాం. కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిందో ఆవు. దీంతో దాని యజమాని ఆపరేషన్ చేయించి ఆ గొలుసుని బయటకు తీయించాడు. కర్ణాటకలోని హీపనహళ్లిలో జరిగిన ఘటన వైరల్ అవుతోంది. అసలు ఆ గొలుసు ఎలా మాయమైంది. ఎలా కనిపెట్టారో చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు. ఆవును, దూడను కడిగి, అందంగా ముస్తాబు చేశారు. దూడ మెడలో పూలదండతో పాటు బంగారు గొలుసు కూడా వేశారు. పూజ పూర్తయిన తర్వాత పూలదండతో పాటు గోల్డ్ చెయిన్ కూడా తీసేసి పక్కనపెట్టారు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ ఉండాల్సిన బంగారు చెయిన్ కనిపించలేదు. అక్కడున్న పూలదండ కూడా కనిపించలేదు.
ఏంచేయాలో అర్థంకాని శ్రీకాంత్ హెగ్డే వెంటనే అక్కడ వెతికినా ఫలితం లభించలేదు. దండతో పాటు గొలుసు కూడా మింగేసి వుంటాయని భావించారు. శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు వాటి పేడలో ఏమైనా గొలుసు వస్తుందేమోనని గమనించసాగారు. కానీ అలాంటివేం రాలేదు.
యజమాని పశువైద్యుడిని సంప్రదించారు. ఆయన మెటల్ డిటెక్టర్ సాయంతో ఆవు పొట్టలో బంగారు గొలుసు ఉందని కనిపెట్టారు. ఆవు పొట్టకు స్కానింగ్ చేయగా, ఆ గొలుసు కచ్చితంగా ఎక్కడ ఉందో ఆ కనిపించింది. ఆవుకు ఆపరేషన్ నిర్వహించి, బంగారు గొలుసును బయటకు తీశారు. కానీ అక్కడే అపలైన ట్విస్ట్. 20 గ్రాముల బరువుండాల్సిన గొలుసు ఆపరేషన్ చేసి తీశాక 18 గ్రాములే వుందట. మిగిలిన రెండు గ్రాములు ఆవు పొట్టలోనే వుందా? ఏమైందనేది సస్పెన్స్.