బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని… ఇది డిసెంబర్ 4న వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్‌కు అధికారులు జవాద్ అని నామకరణం చేశారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
జవాద్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు జవాద్ తుఫాన్ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3, 4 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తుఫాన్ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో కూడా ఈరోజు, రేపు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
జవాద్ తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. హౌరా-సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు.