సంక్రాంతి సందర్భంగా రాజ్ భవన్‌లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో రాజ్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ తయారు చేశారు. అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ పండుగ జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని, అందుకు వైద్య శాఖకు అభినందనలు తెలిపారు. వచ్చే సంక్రాంతి ఎటువంటి వైరస్‌లు లేకుండా జరుపుకునేలా ఆశిద్దామన్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందామన్నారు.