తెలంగాణలో కొత్త మద్యం పాలసీని కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఎక్సైజ్ శాఖ. దీపావళి తర్వాత దుకాణాలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా రెండేళ్లకోసారి పాలసీ గడవు ముగుస్తుంది. నిజానికి…ఈ అక్టోబర్‌తో గడువు ముగియాల్సి ఉండగా..డిసెంబర్ వరకు పొడిగించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడినందున పాత లైసెన్స్‌లను పొడిగించాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు నుంచి కొత్త పాలసీ కూడా అమల్లోకి రానుంది.
ఇక…కొత్త పాలసీ విధివిధానాలను ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నవంబరు 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం అనంతరం కొత్త పాలసీపై నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనతో ఉన్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభించి వారం రోజులపాటు దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. మరోవైపు…మద్యం ప్రియులకు కూడా తీపి కబురు ఇవ్వనుంది ఎక్సైజ్ శాఖ. గత పాలసీలో రాష్ట్రవ్యాప్తంగా 2216 మద్యం దుకాణాలుండగా ఈసారి దాదాపు 10 శాతం వరకు దుకాణాలు పెరగనున్నాయి. మద్యం దుకాణాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ చిక్కులు తొలిగాక నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.