చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్నాడు. పట్టుమని నాలుగంటే నాలుగే చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది, ఐదో చిత్రంగా ‘సీటీమార్’ రూపొందింది. గత సంవత్సరమే జనం ముందుకు రావలసిన ఈ చిత్రం కరోనా కల్లోలం కారణంగా విడుదల తేదీలు మార్చుకుంటోంది.
సంపత్ నంది బి.ఫార్మసీ పూర్తి చేయగానే, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి వద్ద మూడేళ్ళ పాటు పనిచేశాడు. అదే సమయంలో ముంబయ్, బెంగళూరుల్లో యాడ్ ఫిలిమ్స్ రూపొందించాడు. యాడ్స్ తీయడంతో మంచి పట్టు లభించింది. దాంతో సినిమాకు డైరెక్షన్ చేయాలని నిశ్చయించాడు. అతని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రంగా ‘ఏమైంది ఈ వేళ’ నిలచింది. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఆరంభంలో అంతగా సందడి చేయలేకపోయినా, మెల్లగా గుడ్ టాక్ సంపాదించుకుంటూ సక్సెస్ రూటులో సాగింది. వరుణ్ సందేశ్ స్థాయికి ‘ఏమైంది ఈ వేళ’ సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ సినిమాను చూసి, రామ్ చరణ్ తన ‘రచ్చ’కు సంపత్ నందికి అవకాశం కల్పించాడు. ‘రచ్చ’కు ముందు ఆ చిత్ర నిర్మాతలు రామ్ చరణ్ తోనే ‘మెరుపు’ అనే చిత్రం ఆరంభించారు. అది ఓ షెడ్యూల్ అయిన తరువాత అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. దాంతో సంపత్ నందికి అవకాశం లభించింది. టైటిల్ కు తగ్గట్టే ‘రచ్చ’తో రచ్చ చేసేశాడు. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రూపొందిన ‘గాలిపటం’ చిత్రం నిర్మాణంలో పాలుపంచుకున్నాడు సంపత్ నంది. తరువాత రవితేజను ‘బెంగాల్ టైగర్’గా చూపిస్తూ మరో సినిమాకు దర్శకత్వం వహించాడు సంపత్. అందులోనూ తనదైన మార్కు చూపించాడు,కానీ, ‘రచ్చ’ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తరువాత ‘పేపర్ బోయ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు సంపత్. అదీ అంతగా అలరించలేకపోయింది. గోపీచంద్ ద్విపాత్రాభినయంతో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘గౌతమ్ నంద’ భలే ట్విస్టులతో సాగిందే కానీ, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
మళ్ళీ గోపీచంద్ తోనే ‘సీటీమార్’ రూపొందించాడు సంపత్ నంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘సీటీమార్’తో గోపీచంద్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఈ సినిమాకు పనిచేసిన వారు చెబుతున్నారు. అదే నిజమైతే, సంపత్ నందికి కూడా ‘సీటీమార్’ కలసివచ్చినట్టేనని చెప్పొచ్చు.