పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.బయటకు రాలేకే మృతిచెందారు. ప్రమాదంలో వెంటనే బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరణించినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు వున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశాలు జారీచేశారు. హుటాహుటిన జంగారెడ్డిగూడెం బయలు దేరారు మంత్రి ఆళ్ల నాని. జంగారెడ్డిగూడెం అధికారులతో ప్రమాదం ఘటనపై సమీక్షించనున్నారు. ఇదిలా వుండగా బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ రాజబాబు ప్రమాదం జరిగిన తీరుని వివరించారు. వాగులో పడిన వెంటనే తాడుసాయంలో బయటకు వచ్చామని, తనతో పాటు మరికొందరిని రక్షించానన్నారు. ఒళ్ళంతా నొప్పులుగా వున్నాయని, ఆస్సత్రిలో చికిత్స తీసుకున్నానన్నారు రాజబాబు.
ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు చంద్రబాబు, లోకేష్, సోము వీర్రాజు, పవన్.
బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ.
