NTV Telugu Site icon

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్‌ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్‌ నేతలు హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్‌ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో ఏర్పాటు చేశారు.

పోలింగ్‌ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. అయితే ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీని కోసం రెండు కౌంటింగ్‌ హాల్‌లను ఏర్పాటు చేయగా, ఒక్కో హాల్‌లో 7 టేబుల్ల చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నారు. ఒక్కో రౌండ్లలో సుమారు 9 వేల నుంచి 10 వరకు ఓట్ల లెక్కింపు జరుగనుంది.

ఒక్కో రౌండ్‌ లెక్కింపుకు 30 నిమిషాల సమయం పడుతుంది అధికారులు చెబుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ తర్వాత హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలో 2లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు.