ప్రపంచం గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాదిమంది బలయ్యారు. ప్రతి దేశం ఈ కోవిడ్ బారిన పడింది. కరోనా ఇక తగ్గుముఖం పట్టిందిలే అని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తోంది. మూడుకేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ మళ్లీ తన సత్తా చాటుతుందని భావిస్తున్న వేళ పలు దేశాలు కఠిన ఆంక్షలవైపు మళ్లుతున్నాయి. ఈసారి సరికొత్త రూపంలో లాక్డౌన్లకు సిద్ధమయ్యాయి. కరోనా నుంచి రక్షణగా భావిస్తున్న టీకా తీసుకోనివారిని తేలికగా తీసుకోకూడదని భావిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారికి లాక్డౌన్లు విధిస్తున్నాయి. వారిని ప్రజా జీవితానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేసి.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి.
ఐరోపా దేశాల్లో కేసులు పెరగకుండా వుండేందుకు వ్యాక్సిన్ లేనివారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారికి సూపర్ మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫార్మసీలు, థియేటర్లు, సినిమాహాళ్లు, క్రిస్మస్ మార్కెట్లతో పాటు పలు ముఖ్యమైన చోట్ల ప్రవేశం నిషిద్ధం. జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో ఈతరహా నిబంధనలు అమలుచేస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకోనివారిని కేఫేలు, రెస్టారెంట్లలోకి రానివ్వరు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించాల్సిందే. మన కరెన్సీలో చెప్పాలంటే 40వేల నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా చెల్లించాలి. ఇటలీలో నిబంధనలు మరింత కఠినంగా వున్నాయి. ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. లేకుంటే ఉద్యోగం ఫట్.డిసెంబర్ 6 నుంచి ఇటాలియన్లకు కోవిడ్ గ్రీన్ పాస్తప్పనిసరి చేసింది.