హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హుజురాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతు ఇచ్చినా, బీజేపీకి ఓటు వేసినా దళితబంధు రాదు, పెన్షన్ ఇవ్వరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అబద్ధాలను హుజురాబాద్ ప్రజలు నమ్మరన్నారు.
Read Also: నమ్మకాల పార్టీ టీఆర్ఎస్- అబద్దాల పార్టీ బీజేపీ
కరోనా సమయంలో తాను వైద్యశాఖ మంత్రిగా కరోనా పేషెంట్ల మధ్య తిరిగితే.. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చుని తనను ఖతం చేసేందుకు సన్నాహాలు చేశాడని ఈటెల విమర్శించారు. తనకు ఇజ్జత్ లేని పార్టీలో ఉండొద్దనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఈటెల తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి 20 ఏళ్ల చరిత్ర ఉంటే.. అందులో తన చరిత్ర 18 ఏళ్ల 6 నెలలు అని ఈటెల వెల్లడించారు. బీజేపీని గెలిపించి కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాగా వీణవంక మండలం కనపర్తిలో ఈటెల ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు.