ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 23 సాయంత్రం తెలుగు ప్రేక్షకులకు ‘దిల్’ రాజు… తమ బ్యానర్ హీరో ఆశిష్ ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది. కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రౌడీ బాయ్స్’ ఇక పర్ ఫెక్ట్ ప్లాన్ తో అక్టోబర్ లో జనం ముందుకు రావడమే మిగిలి ఉంది. తమ బ్యానర్ నుండి వచ్చే సినిమాల రిలీజ్ విషయంలో ‘దిల్’ రాజు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. లేట్ అయినా… లేటెస్ట్ గా రావాలన్నది ఆయన తపన. సో… ఆశిష్ మూవీ విషయంలో ‘దిల్’ రాజు ఇంకెంత ప్లానింగ్ తో పబ్లిసిటీ చేస్తారో ఊహించుకోవచ్చు.
ఓన్ బ్యానర్ కు ఓన్ హీరో!
ఇది ‘దిల్’ రాజుకు సిల్వర్ జూబ్లీ ఇయర్. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, ప్రొడ్యూసర్ గా ‘దిల్’ రాజు ది సక్సెస్ ఫుల్ జర్నీ. ప్రస్తుతం ఆయన 50వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే… ఇంతకాలం తమ బ్యానర్ కు సొంత హీరో లేడనే చిన్నపాటి అసంతృప్తి ‘దిల్’ రాజుకు, శిరీష్ కు ఉండి ఉండొచ్చు. ఆ లోటును తీర్చడానికి ఆశిష్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రమ్ చేస్తున్నాడు. అదీ ఆషామాషీగా కాదు… విశాఖ, బాంబే తో పాటు యు.ఎస్.లోనూ ఆశిష్ నటనలో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ‘హుషారు’తో డైరెక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకున్న హర్ష చేతిలో ఆశిష్ ను పెట్టాడు ‘దిల్’ రాజు. యూత్ మైండ్ సెట్ ను బాగా గ్రహించిన హర్ష… ‘హుషారు’ తరహాలోనే ‘రౌడీ బాయ్స్’నూ యూత్ ను టార్గెట్ చేస్తూ తీశాడని అంటున్నారు. క్యూట్ బేబీ అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఆశిష్ కు జోడీగా నటించింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ‘రౌడీ బాయ్స్’ను మ్యూజికల్ హిట్ చేస్తుందనడంలో సందేహం లేదు.
బన్నీ బాటలో ఆశిష్!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అర్జున్ ‘గంగోత్రి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా… అతన్ని అన్ని వర్గాలకూ చేరువ చేసిన సినిమా మాత్రం ‘ఆర్య’ నే! ‘దిల్’ రాజు పర్ ఫెక్ట్ ప్లానింగ్, సుకుమార్ మేకింగ్ స్టైల్, బన్నీ హార్డ్ వర్క్… ఇవన్నీ ఆనాడు ‘ఆర్య’ను విజయపథంలోకి తీసుకెళ్ళాయి. అక్కడ నుండి బన్నీ వెనుదిరిగి చూసుకున్నదే లేదు. ఇప్పుడు ఆశిష్ ప్రయాణాన్ని కూడా ‘దిల్’ రాజు అలానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… బన్నీ కెరీర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదనిపిస్తుంది. దాంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చేయడానికి చాలా కాలమే పట్టింది. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా రాబోతున్న ‘పుష్ప’ బన్నీ తొలి పాన్ ఇండియా మూవీ. కానీ ‘దిల్’ రాజు తలుచుకుంటే… ఆశిష్ ను అలా పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే… ఈ యేడాది నుండే ‘దిల్’ రాజు బాలీవుడ్ లోనూ నిర్మాతగా పాగా వేస్తున్నారు. ఏకంగా మూడు సినిమాలను మిత్రులతో కలిసి ఆయన హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అన్నీ మంచి శకునములే!
ఆశిష్ కు దిల్ రాజు లాంటి అంకుల్ దొరకడం నిజంగా అదృష్టం. దానికి తోడు ఆశిష్ తండ్రి శిరీష్… ‘దిల్’ రాజు చిత్రసీమలోకి వచ్చిన దగ్గర నుండి వెన్నంటే ఉండి ఈ బ్యానర్ కు బ్యాక్ బోన్ గా నిలిచారు. ‘దిల్’ రాజు బ్యానర్ నుండి పరిచయం అయిన నాగచైతన్యకు తొలి చిత్రం ‘జోష్’ అచ్చిరాలేదు కానీ… ఆ బ్యానర్ స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు మెమొరబుల్ హిట్స్ ను ఇచ్చింది. ఈ యేడాది కూడా పవన్ కళ్యాణ్ తొలిసారి ఈ బ్యానర్ లో నటించి ‘వకీల్ సాబ్’తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. సో… ఈ యేడాది ‘దిల్’ రాజు బ్యానర్ కు బాగా కలిసొచ్చినట్టే! సినిమా నిర్మాణాన్ని ప్రాణంగా భావించే ‘దిల్’ రాజు… ఆశిష్ ను సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టకుండా విశ్రాంతి తీసుకోరన్నది అందరికీ తెలుసు. అయితే… తన ప్రతిభతో ఆశిష్ ఏ స్థాయికి ఎదుగుతాడనేది కాలమే నిర్ణయించాలి!!