కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా డెల్టా వేరియంట్ కేసులు, ఇప్పుడు మరోసారి భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాల్లోకి ప్రవేశించింది. దీంతో ఒమిక్రాన్ కేసులు కూడా యూఎస్, యూకే లాంటి దేశాల్లో అధికంగానే నమోదవుతున్నాయి. వీటితో పాటు ఒమిక్రాన్ మరణాలు సంభవించడంతో ఆయా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.
రోజురోజుకు ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. నిన్న ఒక్క రోజే 2,19,126 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 110 మంది కరోనాతో మృతి చెందారు. అయితే ఇక్కడ 75 శాతం కంటే ఎక్కువగానే కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగినా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. ఫ్రాన్స్‌లో ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్‌లో కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేశారు.