కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. ఈ పేరు చెబితే అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే మాత్రం తెలంగాణవాసులందరికీ సుపరిచితమే. ఈ రాజకీయ ప్రస్థానం కౌన్సిలర్‌గా ప్రారంభమైంది. ఆ నాటి నుంచి నేటి వరకు వివిధ పార్టీలు మారినా తన దైన శైలితో రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి, ఓ సారి చీఫ్ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్నా జగ్గుభాయ్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా తయారయ్యారని ఆ పార్టీ నేతల్లో వినిపిస్తున్న చర్చ. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ జగ్గుభాయ్.. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి పార్టీలో విముఖతతోనే ఉన్నారనేది పార్టీ వర్గాల్లోని భావన.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా పోవడంతో, అసలు పార్టీలో ఏం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ పంచాయితిలాంటి సమావేశం పెట్టి.. పార్టీలోని అందరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హుకుం జారీ చేశారు. ఈ సమావేశానికి జగ్గారెడ్డిని కూడా ఆహ్వానించి ఆయన తీరును తప్పుపట్టి మరోసారి పార్టీ విషయాలు బయట, మీడియా ముందు చర్చించవద్దని, అవసరమైతే పార్టీ సమావేశాల్లో సూచించాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి సరే అనట్లుగా జగ్గన్న కూడా ఓకే చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైననాటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలకు అడుగులు వేశారు. ఇటీవల రచ్చబండ కార్యక్రమం అంటూ మరోసారి రంగంలోకి దిగారు.
సీఎం కేసీఆర్ ఇలాకా ఎర్రవెల్లిలో రచ్చబండ పెట్టి కేసీఆర్‌ను రచ్చకీడుస్తానంటే.. పోలీసులు పరిష్మలేదని రేవంత్ రెడ్డిన హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉనొక్క ఎమ్మెల్యేను నన్ను సంప్రదించకుండా నా అడ్డలో రచ్చబండ పెట్టుడేందీ.. అంటూ జగ్గభాయ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఈ సారి జగ్గన్న మాట్లాడిన వ్యాఖ్యలకు పార్టీ సీనియర్ నేతలు కూడా మద్దతిచ్చారు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోయేలా ఉండాలని సూచించారు కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి తన నియోజకవర్గంలో గెలవడానికి జగ్గుభాయ్ ప్లాన్ వేశారా..? అంటే అలాగే అనిపిస్తోంది.
ఎందుకంటే.. నియోజకవర్గ ప్రజల మన్నన పొందేందుకోఏమోగానీ తన ఇలాకాను అభివృద్ధి చేయాలని కోరుతూ ఇటీవల కేటీఆర్‌కు వినతిపత్రం అందించారు. అంతేకాకుండా ఇప్పుడేమో సీఎం కేసీఆర్‌ను కలుస్తానంటూ.. అపాయిట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. అంటూ వెల్లడించారు. అయితే జగ్గుభాయ్ ప్రాబ్లమ్స్ అర్థం కాని కాంగ్రెస్ నేతలేమో.. జగ్గుభాయ్ టీఆర్‌ఎస్‌కి కోవర్టులా మారారు. జగ్గన్న టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు విన్న జగ్గన్న నేను కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లనని స్పష్టం చేసినప్పటికీ.. జగ్గన్న పరిస్థితి.. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరికొందరు.. జగ్గారెడ్డి హస్తంలోనే ఉంటూ.. తన నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి పనులు చేయించుకుంటారా..? లేక.. టీఆర్ఎస్ లోకి చేరి అభివృద్ధి పనులు చేయించుకుంటారా..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.