హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్‌కు కొత్త కానప్పటికీ …హుజురాబాద్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించి.. వారిని రంగంలోకి దింపింది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ లకు అప్పగించారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఇటు కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గ నుంచి నాయకుల చేరికలు కేసీఆర్ సమక్షంలోనే జరిగాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. గతంలో ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అవసరమైన సలహాలు ఇచ్చి.. వాటిని అమలు చేయాలని పార్టీ నేతలకు సూచించే వారు కేసీఆర్. హుజురాబాద్ బై ఎలక్షన్ విషయంలో కేసీఆర్ ప్రతి అంశంపై నజర్ పెట్టారు. ప్రచారం జరుగుతున్న తీరు, ప్రత్యర్థి పార్టీల పరిస్థితి, ప్రజల నుంచి వస్తున్న స్పందన.. ఇలా ఒక్కో అంశంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇటు మంత్రులు, ఇంఛార్జిలతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే.. విపక్షాలు మరింత బలహీన పడతాయి. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ నజర్ పెట్టారని టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.