ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
Read Also: రెచ్చిపోయిన దొంగలు .. అయ్యప్ప స్వాములకే శఠగోపం
ఈనెల 3న అర్ధరాత్రి దాటిన తర్వాత తొలుత తాడేపల్లి నవోదయా కాలనీలోని రెయిన్ బో విల్లాలోకి చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చొరబడ్డారు. 37, 39, 44వ నంబర్ ఇళ్లలో తలుపులు పగులకొట్టి లోపలకు ప్రవేశించారు. అయితే ఆయా ఇళ్లలో విలువైన వస్తువులేవీ పోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సోమవారం వరకు బాధితులు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈనెల 1 నుంచి వరుసగా చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుండటం తెలిసిందే. పోలీసులు అప్రమత్తమై నిఘా పెంచి ఉంటే ఈనెల 3న నవోదయా కాలనీలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించేది కాదని… స్వయంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల విల్లాల్లోకే చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందంటే పోలీసుల భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.