ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. భారత్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఫస్ట్‌వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.. ప్రాణనష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది.. అయితే, ప్రస్తుతం కరోనా రోజువారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది.. కానీ, మళ్లీ ముప్పు పొంచేఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం.. వచ్చే 3 నెలలూ పండుగల సమయం, అలాగే, ఫ్లూ కేసులు పెరిగే కాలం కూడా.. దీంతో.. ప్రతిఒక్కరూ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్..
ఇక, దేశవ్యాప్తంగా కరోనా కట్టడిలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలను వచ్చాయని.. వాటిని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు వీకే పాల్.. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20శాతం మందికి రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తిచేశామని.. 62శాతం మందికి కనీసం ఒక్కడోసు అందినట్టు వెల్లడించారు. ఇక, ఈ సీజన్‌లో వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు.. కోవిడ్ నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదన్నారు ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ.. మరోవైపు, కేరళలో కూడా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. ఇతర రాష్ట్రాల్లో కూడా మెరుగైన పరిస్థితి ఉందని.. మరో మూడు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్రం.