బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో ఉన్న మత్స్యకారులు, వారి ఓడలను సంబంధిత సమాచారాన్ని సేకరించాలని దిశానిర్దేశం చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, మందులతోపాటు ఇతర నిత్యవసర వస్తువుల సరఫరా దృష్టి సారించాలని కేంద్రం సూచించింది.విద్యుత్, రోడ్లుతో పాటు అత్వసర సేవలను పునరుద్ధరించేందుకు సంబంధిత బృందాలను సంసిద్ధంగా ఉంచాలని పేర్కొంది. తుపాను తీరం చేరే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. అవసరం అయితేనే పౌరులు బయటకు రావాలంది. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు చేరాలి.
సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదని, జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యం అని సూచించారు జగన్. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. తీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో వీస్తున్నాయి ఈదురు గాలులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి NDRF బృందాలు.