దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.. అందులో భాగంగా.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.. అయితే, కరోనా నేపథ్యంలో.. 11 రాష్ట్రాలు ఇప్పుడే ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘాన్ని కోరాయి.. దీంతో.. ఆ 11 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం… పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి బైపోల్ నిర్వహించనున్నారు.. పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు,, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఈసీ.. షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుండగా.. 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.. 14న నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక, సెప్టెంబర్ 30న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 3న ఓట్లు లెక్కించి.. ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఉప ఎన్నికలు ఇప్పుడే వద్దని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి.. రెండు తెలుగు రాష్ట్రాలు సహా 11 రాష్ట్రాలు.. పండుగల సీజన్ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి.. దీంతో.. ఆ 11 రాష్ట్రాలు మినహా బెంగాల్, ఒడిశాలో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాగా.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిలో బద్వేల్‌లో ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.