రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు.
బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర సంస్థల చర్య, అదానీ గ్రూపుపై ఆరోపణలు వంటి అంశాలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని నిలదీసే అవకాశాలు ఉన్నాయి. అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో పోరాడనుంది. తొలి విడత సమావేశాల్లోనూ ఆదానీ వ్యవహారం ఉభయ సభలను కుదిపేశాయి. అయితే, ఆర్థిక బిల్లును ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశం అని కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాతే ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు.
Also Read:MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. కాసేపట్లో పోలింగ్
పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించి తమ వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఉదయం సమావేశమవుతాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్షాలు సమావేశమై ధరల పెరుగుదల, ఫెడరల్ ఏజెన్సీల దుర్వినియోగం వంటి వివాదాస్పద అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీలు ఉదయం 9.30 గంటలకు సమావేశం కానున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందని అన్నారు.”మేము ప్రజల సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తాం. ధరల పెరుగుదల, LPG ధర, అదానీ, ఏజెన్సీల దుర్వినియోగం, రైతుల సమస్యలు, గవర్నర్ల జోక్యం వంటి అంశాలపై మా పార్టీ పోరాటం చేస్తుంది’ అని అన్నారు.
Also Read:Kiran Kumar Reddy: కాంగ్రెస్‌కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
కాగా, ప్రతిపక్ష పార్టీలు తమ నాయకులపై ఇటీవల సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడుల అంశాన్ని కూడా పెద్ద ఎత్తున లేవనెత్తే అవకాశం ఉంది. వీరిలో కొందరిని వివిధ కేసులలో ప్రశ్నించడం, అరెస్టు చేయడం కూడా జరిగింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రత్యర్థి పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆయా పార్టీల నేతలు ఆరోపించారు.