ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. బెయిల్ వస్తుందా? రాదా? అనేది హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో ఉన్నాడు ఆర్యన్ ఖాన్. అక్టోబర్ 2న అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ కోసం విఫలయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. మంగళవారం ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీంతో ఆయనకు బెయిల్ లభిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో వివాదం రేపుతోంది. షారుక్ ఖాన్ కుటుంబానికి బాలీవుడు ప్రముఖులు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, పూజా బేడీ తదితరులు మద్దతు పలికారు. అదే సమయంలో ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ఈ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి.

ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారంలో బాలీవుడ్ తీరును ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో నిశ్శబ్దంగా ఉన్న బాలీవుడ్ పెద్దల్ని ఆయన ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. షారూక్ సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఉపాధి కల్పించారని పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారు. అలాంటి ఆయన సంక్షోభ పరిస్థితుల్లో ఉంటే..బాలీవుడ్ సినీ పరిశ్రమ నిశ్శబ్దం దేనికి సంకేతం అంటున్నారు.
ఇవాళ షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు వేరే వాళ్ళుండవచ్చు. అప్పుడు కూడా మౌనంగానే వుంటారా? అని నిర్మాత సంజయ్ గుప్తా చేసిన ట్వీట్ పై చర్చ సాగుతోంది. ఆర్యన్ ఖాన్ కేసు బాలీవుడ్‌లో రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోందా అనే అనుమానాలు వస్తున్నాయి. కొడుకు బెయిల్ కోసం షారూక్ ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.